భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం

  •     శాస్త్రోక్తంగా అగ్నిమధనం, ప్రతిష్ఠ
  •     గరుడముద్దలు స్వీకరించిన మహిళలు
  •     భారీగా హాజరైన భక్తులు
  •     ఘనంగా బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. తిరుకల్యాణ ఉత్సవమూర్తులు శ్రీసీతారామలక్ష్మణ స్వామివారితో ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ పటాన్ని మంగళవాయిద్యాల నడుమ ధ్వజస్తంభం పైకి ఎగుర వేశారు. అంతకు ముందు ఉదయం శ్రీ సీతారామ చంద్రస్వామికి ముత్తంగి సేవ చేశారు. ముత్యాలు పొదిగిన వస్త్రాలను గర్భగుడిలో మూలవరులకు, ఉత్సవమూర్తులకు, సుదర్శనమూర్తికి, ఆంజనేయస్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి అలంకరించి ముత్తంగి సేవ నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠాపనలో భాగంగా అగ్నిని మధించి సేకరించి యాగశాలలో ప్రతిష్ఠించారు. 

బలిహరణం

గరుడ పటావిష్కరణ తర్వాత బలిహరణం నిర్వహించారు. సంతానం లేనివారికి గరుడముద్దలు ప్రసాదంగా ఇచ్చారు. సాయంత్రం యాగశాలలో  భేరీపూజ జరిగింది.  బలిగజ్జలతో అష్టదిక్పాలకులను ఆహ్వానించారు. ఉత్సవమూర్తులతో పాటు ఎనిమిది దిక్కులు బలిహరణం చేశారు. అనంతరం స్వామికి తిరువీధి సేవ జరిగింది. హనుమంత వాహనంపై స్వామివారు  రాజవీధిలోని మాడవీధుల గుండా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి పూజలందుకుని తిరిగి ఆలయానికి వచ్చారు.

నేడు ఎదుర్కోలు ఉత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారాలకు ఈసీ నో..మంత్రి లెటర్​  

సీతారాముల కల్యాణం తిలకించడానికి భద్రాచలం రాలేని భక్తుల కోసం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. కానీ, ఈసారి లోక్​సభ ఎన్నికల కోడ్​ అమలులో ఉండడంతో లైవ్​ ఇవ్వడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ అనుమతి నిరాకరించింది. డీడీ(దూరదర్శన్​) ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని సూచించింది. దీని కోసం దూరదర్శన్​ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకోగా, ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్​ ప్రియాంక ఆల ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ప్రైవేటు సంస్థల ద్వారా ప్రసారాలు ఇచ్చేందుకు ఆఫీసర్లతో చర్చిస్తున్నారు. అరగంట ఆలస్యంగా ఛానెళ్లకు వీడియో తీసి ఇవ్వాలని యోచిస్తున్నారు. మరోవైపు కల్యాణాన్ని లక్షలాది మంది భక్తులు టీవీల్లో వీక్షించేలా లైవ్​ టెలికాస్ట్​కు అనుమతి ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..ఎలక్షన్​ కమిషన్ సీఈవో వికాస్​రాజ్​కు మరో లెటర్​ రాశారు.